నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి -రైతు భరోసా నిధులు జమ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. ఇవాళ్టి నుంచి రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎకరం వరకు సాగు చేస్తున్న వారి ఖాతాల్లో ప్రస్తుతం నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రంలోని 17లక్షల 3వేల రైతులు లబ్ధి పొందనున్నారు. వారి ఖాతాల్లో ఇవాళ నిధులు జమ కానున్నాయి. సీఎం ఆదేశాలతోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

బావిలో పడిన పెద్దపులి & అడవి పంది : మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లో బావిలో పడిన ఓ ఆడ పెద్దపులి ప్రాణాలను స్థానికుల చొరవతో అటవీ అధికారులు కాపాడారు. పెంచ్ నేషనల్ పార్కు సమీపంలోని పిపారియా హర్దులి గ్రామంలో పెద్దపులి.. ఓ అడవి పందిని వేటాడుతుండగా ప్రమాదవశాత్తూ.. ఆ రెండు జంతువులు బావిలో పడిపోయాయి. దాన్ని గమనించిన స్థానికులు అవి మునిగిపోకుండా ఉండేందుకు ఓ చెట్టు దుంగను అందులో వేశారు. తర్వాత ఒక మంచాన్ని తాళ్లతో కట్టి బావిలోకి దింపారు. బావి వద్దకు చేరుకున్న 60 మంది అటవీ సిబ్బంది.. ఓ క్రేన్ సాయంతో బోనును బావిలోకి దించగా ముందు పులి.. బోనులోకి ప్రవేశించింది. తర్వాత అడవి పందిని కూడా అలాగే రక్షించారు. వన్యప్రాణులను రక్షించేందుకు 4 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.