- Gurukul Students Missing : ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ
- కలకలం రేపిన 6గురు పదో తరగతి విద్యార్థుల అదృశ్య ఘటన
- ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ మద్యం సేవించి హాజరైన విద్యార్థులు
- వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ
- గమనించి మందలించిన ఉపాధ్యాయులు
- మనస్థాపానికి గురై పాఠశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు

Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు.
ఉపాధ్యాయుల మందలింపుతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన గురుకుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించారు.
విద్యార్థుల ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే విజయవాడకు వెళ్లి, అదృశ్యమైన భాను ప్రకాశ్, నాగ వంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్‌లను క్షేమంగా పాఠశాలకు తిరిగి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి, వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. విద్యార్థులను తిరిగి ఉపాధ్యాయుల , తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విద్యార్థుల రక్షణ కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, భవిష్యత్తులో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ ఘటన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, విద్యార్థుల సంక్షేమం కోసం మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు.
HYDRA : శంషాబాద్ లో హైడ్రా కూల్చివేతలు
- శంషాబాద్ లో హైడ్రా కూల్చివేతలు
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- సంపత్ నగర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన నిర్మాణాలు

HYDRA : శంషాబాద్ లో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఊట్పల్లి లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను, ఊట్పల్లి లో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండిటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగాయి. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ బుద్ద భవన్ లో హైడ్రా ప్రజావాణి జరుగనుంది. గ్రేటర్ పరిధిలో హైడ్రా ప్రజావాణి కి ప్రజల మద్దతు పెరిగింది. ప్రజావాణిలో నేరుగా కమిషనర్ రంగనాథ్‌కు కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దీంతో.. హైడ్రా ప్రజావాణి లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ల్యాండ్ ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడితో చేసిన కబ్జాలు బయట పడుతున్నాయి. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్న సమస్యలపై వెంటనే స్పందించి చర్యలకు అదేశిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి జరగనుంది. ప్రజావాణి ప్రారంభానికి ముందే బుద్ద భవన్ కి వచ్చి ఎదురు చూస్తున్నారు భాదితులు. వచ్చిన బాధితులకు టోకెన్ పద్ధతిలో ప్రజావాణికి అనమతిస్తున్నారు హైడ్రా సిబ్బంది.
MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
- ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
- ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహణ
- మార్చి 3న ఓట్ల లెక్కింపు

MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఎన్నికల ప్రక్రియ – ముఖ్యమైన తేదీలు
ఫిబ్రవరి 11: నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
ఫిబ్రవరి 27: పోలింగ్ నిర్వహణ
మార్చి 3: ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే ప్రాంతంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct) అమలులోకి వస్తోంది.
ఎన్నికల ఏర్పాట్లు – పటిష్ట భద్రతా చర్యలు
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రధాన అంశాలను చర్చించారు.
ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ (Training) ఇవ్వాలని అధికారులకు సూచించారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్‌లో, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.
పోలింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవరోధాలు ఉంటే, అక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సర్టిఫికెట్లు జారీ చేసి, వారికీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. ఈ మేరకు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి, నియమాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.